Monday, June 13, 2011

ప్రణాళికకు ఇదే సమయం


భవిష్యత్ ప్రణాళికకు ఇదే సరైన సమయం. పాఠశాల విద్యాస్థాయిలో ఉన్న విద్యార్థులు మొదలు పరిశోధనకు సిద్ధమవుతున్న నిపుణుల వరకూ ఇటు ఉన్నత విద్యావకాశాలకు, అటు కెరీర్‌కూ రెండింటికీ ప్రణాళిక చాలా అవసరం. ప్రతి క్షణం నిర్ణయాలు తీసుకుంటూ నిరంతరం మార్చేది ప్రణాళిక కాబోదు. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని, తదనుగుణంగా ప్రస్తుత పరిస్థితులను మేళవించుకుంటూ ముందుకు సాగేదే ప్రణాళిక. పాఠశాల స్థాయినుంచే తాను ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో, అందుకు అవసరమైన ఉన్నత విద్యను ఎక్కడ అభ్యసించాలనుకుంటున్నారో ముందుగా ప్రణాళికలు వేసుకున్నవారే విజయం సాధిస్తున్నారు. ఒకప్పుడు ఈ లక్ష్యాలను వెల్లడించేవారిని అమాయకులుగానో లేదా పిచ్చివారిగానో చూసే పరిస్థితి ఉండేది. కానీ నేడు విద్యార్థుల్లో చైతన్యం, అవగాహన, లక్ష్య సాధన దృష్టి, నిరంతర కృషి, పట్టుదల, సాధించాలనే తపన, జిజ్ఞాస, నూతన పోకడలను అవలీలగా ఆకళింపు చేసుకునే నేర్పు, ఓర్పు పెరిగి లక్ష్యాలను సాధించుకోవడం పెద్దగా కష్టమైన పనికాదని తెలుసుకుంటున్నారు. ఏ లక్ష్యమైనా సాధించాలంటే దానికి ప్రణాళిక పట్టుగొమ్మ అవుతుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, టెక్నాలజీ, వ్యవసాయం, అంతరిక్ష రంగం, పరిపాలనా రంగం, జీవ సాంకేతిక శాస్త్ర రంగం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, మనో వికాస శాస్త్రం, భాషాభివృద్ధి రంగం ఇలా తన భవిష్యత్ రంగాన్ని ముందే నిర్దేశించుకోవాలి. అభిరుచి, అవగాహన, ఆసక్తి, అనురక్తి ఆధారంగా ఏ రంగంలో నిభాళించుకోగలమో ప్రాథమిక స్థాయిలోనే ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది. విద్యార్థులను అలా తమ అంతరీక్షణ పరీక్షకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పురిగొల్పాలి. ఆసక్తిని ప్రదర్శిస్తున్న రంగాలపై నిపుణతను, సూక్ష్మ దృష్టిని పెంపొందిస్తూ సానబట్టాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్ లక్ష్యానికి అనుగుణమైన అవగాహన ఏర్పరచుకుంటారు. తాము ఫలానా అధికారి కావాలనో, శాస్తవ్రేత్త కావాలనో, పరిశోధకుడు కావాలనో, రాజకీయ రంగంలో రాణించాలనో అనుకున్నప్పుడు ఆయా రంగాలకు తోడ్పడే విద్యను ఎంచుకోవడం ఉత్తమ మార్గం. ప్రామాణిక విద్యతోపాటు అంతర్జాతీయ విలువలను అలవరచుకునే స్థాయిలో అత్యుత్తమ విశిష్ట విద్యాసంస్థల్లో అభ్యసించడం మరింత తోడ్పాటును ఇస్తుంది.
వైద్య రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థి ప్రాథమిక స్థాయినుంచి గణితంలో ప్రావీణ్యతను ప్రదర్శించడం తన లక్ష్యానికి సరైన దశ కాకపోవచ్చు. అదే ఇంజనీరింగ్ శాస్త్రాల్లో రాణించాలనుకున్న విద్యార్థి జీవశాస్త్రంపై మక్కువ చూపడం భవిష్యత్‌కు ప్రయోజనం కాకపోవచ్చు. ఈ విషయ సంఘర్షణవల్ల లక్ష్యం, ప్రణాళిక దెబ్బతినవచ్చు. విద్యార్థి ఆశయాలు, లక్ష్యాలు, ప్రణాళిక రుజువర్తనంగా ఉండాలి.
ఆరోగ్యం క్షీణించిన లేదా అనారోగ్యానికి గురైన ప్రతిసారీ ఓ వైద్యుణ్ణి ఎలా సంప్రదిస్తామో కెరీర్ విషయం కూడా అంతే. అవసరమైన ప్రతిసారీ లక్ష్యానికి అనుగుణమైన ప్రణాళిక ఎత్తుగడను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి వుంటుంది. అది ఒక రోజుకు సంబంధించి కావచ్చు లేదా వారానికి సంబంధించింది కావచ్చు లేదా రెండుమూడేళ్లకు సంబంధించి కావచ్చు. జీవితంలో తుది ఆశయం ఏమిటనేదే కేంద్రకంగా ఈ కార్యాచరణ కొనసాగాల్సి వుంటుంది. ఇందుకు బహిర్గతంగా ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కొంటూ కొన్నింటిని విస్మరిస్తూ, మరికొన్నింటిని ఆలోచనలకు సైతం దరిదాపులకు రానివ్వకుండా జాగ్రత్తపడుతూ ముందుకు సాగాల్సి ఉంటుంది.ఒక ప్రాంతానికి చేరాలంటే రైలు ప్రయాణం లేదా బస్సు ప్రయాణం ద్వారా ఎలా ప్రణాళిక వేసుకుంటామో అదే రీతిన మన ఆశయాలను చేరుకునేందుకు అటువంటి ప్రణాళిక అవసరం. ఎక్కడ బయలుదేరి ఎక్కడికి చేరుకుని తుదకు మన గమ్యానికి రావడం ఎలాగో ప్రణాళిక వేసుకుంటాం. అదే రీతిన మనం ఏ కోర్సును అభ్యసించి తదనంతరం స్నాతకోత్తర పట్టాను పొంది ఏ దిశగా పయనించి చివరికి మన ఆశయాన్ని చేరుకోవడం ఎలాగో ఒక ప్రణాళిక రూపొందించుకోవాల్సి ఉంటుంది. దీనిని మనం ‘‘కెరీర్ మ్యాప్’’గా చెప్పొచ్చు. దీనికోసం ఎక్కువ కాల హరణం చేయకుండా రూపొందించుకోవాలి.
ప్రతి మనిషికి అనేక బలహీనతలు, బలమైన ఆసక్తులు, మానసిక విచలనాలు ఎన్నో వుంటాయి. కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలంటే ప్రత్యేక లక్షణాలు, శారీరక స్వరూప స్వభావాలు, మానసిక సామర్థ్యాలు అవసరమవుతాయి. వృత్తి రీత్యా ఇటువంటి లక్షణాలు అనివార్యం. వైద్యుడిగా రాణించాలంటే మంచి జ్ఞాపకశక్తి, నిపుణత అవసరం కావచ్చు. ఒక సినీ నటుడిగా రాణించాలంటే దేహదారుఢ్యం, అందం అవసరం కావచ్చు. మానసిక శాస్తవ్రేత్తగా రాణించాలంటే సహనం, ఓపిక, ఎదుటి వారిని ఒప్పించగలిగే వాక్ఛాతుర్యం అవసరం కావచ్చు. ఉపాధ్యాయుడిగా రాణించాలంటే అదే పనిగా మాట్లాడగలగడం, బోధనాంశాలపై సంపూర్ణ అవగాహన, విద్యార్థుల్ని మెప్పించే చిట్కాలు అవసరం కావచ్చు. అంతరిక్ష శాస్తవ్రేత్తగా రాణించాలంటే వీటితో పని లేకుండా కేవలం సాంకేతిక, సమాచార, శాస్త్ర విజ్ఞాన సంబంధమైన పరిజ్ఞానం అవసరం కావచ్చు. ఈ నేపథ్యంలో మన అభిరుచులు, ఏవగింపులు, అయిష్టతలు, అవసరాలు, కాంక్షలు, కోరికలు, వాంఛలు మార్చుకోవలసి రావచ్చు. కొనే్నళ్ళుగా అలవాటుపడిన ఈ జాడ్యాలను వదిలించుకోవడం కష్టతరమే కావచ్చు. అయితే ఇప్పటికైనా ఈ ‘అలవాట్లు’ మార్చుకొనే ప్రయత్నం తప్పనిసరవుతుంది. జాదూగర్ మాదిరి దీనికి ఏం మంత్రం వేస్తారో తెలీదు గానీ ఆశయాలు నెరవేరాలంటే ఆలోచనలు మారాల్సిందే. ఉత్తమ ప్రణాళికకు, ఉన్నత ఆశయాలకు, మహోన్నత లక్ష్యాలకు చేరుకోవాలంటే ఎప్పటికప్పుడు మనలోమనం గతాన్ని సమీక్షించుకుంటూ వర్తమానాన్ని సరిదిద్దుకుంటూ పొరపాట్లు లేని భవిష్యత్తును రూపొందించుకోవాల్సి వుంటుంది. గతంలో నిర్వ్యర్థ కార్యక్రమాలు, కాలక్షేప వ్యవహారాలు మిమ్మల్ని ఏ ప్రయోజనాల దిశగా తీసుకువెళ్లాయో ఆలోచించుకోవాలి. పనికిరాని పనులను, అభిరుచులను మార్చుకోవాలి. అంటే దీని ఉద్దేశ్యం ఏదో ఒక అభిరుచిలో నైపుణ్యత, వేరే రంగంలో రాణించడానికి అడ్డుపడుతుందని కానే కాదు. ఎందరో మహానుభావులు బహుముఖ ప్రజ్ఞాశీలులుగా రాణించారు. ఒకే వ్యక్తి ఐదారు రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించినవారున్నారు. ప్రసిద్ధ చిత్రకారులు పాల్‌గాగిన్‌ను ఈ సందర్భంగా మనం గుర్తుచేసుకోవచ్చు. చిత్రకారుడుగా అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధ వ్యాపార వేత్తగా కూడా రాణించారు. అంతవరకెందుకు సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబూ రాజేంద్రప్రసాద్, సర్దార్ పటేల్ మొదలుకొని నిన్నమొన్నటి సయ్యద్ హస్నైనీ వరకూ అటు మార్పును అందించేవారిగా, మరికొంతమంది రాజకీయ వేత్తలుగా, ఇంకొంతమంది శాస్తవ్రేత్తలుగా, విద్యావేత్తలుగా, న్యాయ కోవిదులుగా, బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించినవారి జాబితా చిన్నదేమీ కాదు. అయితే ఈ సందర్భంగా చెప్పాల్సింది ఒకటే. అభిరుచిని కేవలం కాలక్షేపంగా కాకుండా సంపూర్ణ ప్రజ్ఞగా స్వీకరించాలి. అప్పుడు దాని ప్రయోజనం ఉంటుంది.
ఇదంతా ఒకఎత్తు. ఒక గమ్యాన్ని చేరుకున్న తర్వాత అక్కడితో నీ లక్ష్యాలు, ఆశయాలు, ప్రణాళికలు ముగిసిపోవు. అంతకంటే ఉన్నతమైన, మహోన్నతమైన కోరికలు అంతర్లీనంగా దాగే వుంటాయి. వాటిని సాధించాలంటే నీతి నిజాయితీగా మీకు అప్పగించిన పనులను సజావుగా పూర్తిచేయడమే ఒక అర్హతగా భావించడం మూర్ఖత్వమే అవుతుంది. మిమ్మల్ని మీరు మీ గుణగణాలను, మీ చైతన్యాన్ని, వాక్చాతుర్యాన్ని, ప్రతిభాపాటవాలను ఇతరులకు తెలిసేలా చూడటం మన బాధ్యత అవుతుంది. తన గురించి తాను వివరంగా రాయగలగడం, చెప్పగలగడం , కొత్త ఉద్యోగానికి వెళ్లేముందు పాటించాల్సిన సూచనలను గమనంలోకి తీసుకోవడం, సమయపాలన పాటించడం చాలా ముఖ్యం.ఆశయాలు రాత్రికి రాత్రి నెరవేరవు. వాటిని సాధించాలంటే ఎంతో సమాచారాన్ని సేకరించి, సంగ్రహించాల్సి వుంటుంది. గతంలో సమాచార లభ్యత కొరత వున్నా ప్రస్తుతం ఇంటర్నెట్ పుణ్యమా అని ఆ కొరత తీరింది. ఉద్యోగాలు, అవకాశాలు, చదువులు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు, సవాళ్లు, వాక్పటిమా సామర్థ్యాలు పెంచుకోవడం, భాషా నైపుణ్యాన్ని నగిషీ పట్టడం ఇలా ఒకటేంటి అన్ని అంశాలకు సంబంధించి సమాచారం లక్షల పేజీలు అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఏ లక్ష్యాలను అవలీలగా అందుకోవడం ఈజీనే

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Followers