పరీక్ష స్వరూప స్వభావాలను అర్థంచేసుకోవడం కూడా ఈ సమయంలో చాలా ముఖ్యం. ప్రశ్నాపత్రం మార్పు ఎలా వుంటుంది? ఈ రకమైన ప్రశ్నలు ఎన్ని వుంటాయి? మొత్తం కేటాయించిన సమయం ఎంత? ఆయా విభాగాల వారీగా ఎంతేసి సమయం కేటాయిస్తే నిర్ణీత సమయంలో అన్నింటి సమాధానాలు రాయగల్గుతారు? అనే విషయాలు పరిశీలించి చూసుకోవాలి. విభాగాల వారీగా కేటాయించిన మార్కులు, ఆ విభాగం పూర్తిచేయడానికి పట్టే సమయంపై స్థూలంగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత, ఒక మాదిరి ప్రశ్నాపత్రాన్ని తీసుకొని సమాధానాలు రాసి చూసుకోవాలి. తమ ప్లానింగ్ ప్రకారం సమాధానాలు రాయగల్గుతున్నది, లేనిదీ పరిశీలించి చూసుకోవాలి. దీని ఆధారంగా తమ ప్లానింగ్‌లో అవసరమైన మార్పులు- చేర్పులు చేసుకోవాలి.
-
పరీక్షల సమయం ప్రారంభమైంది. విద్యా సంవత్సరమంతా చదివిన చదువుకు సమర్థవంతంగా పరీక్షలు రాయడం ద్వారా సార్థకత చేకూర్చాలని విద్యార్థులు ఆరాటపడుతుంటారు. తల్లిదండ్రులు ఒకింత ఆందోళనకు లోనయ్యే సమయం కూడా యిదే! అయితే అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు సత్ఫలితాలు రావాలనే కోరుకుంటారు. ఇందులో సఫలీకృతం కావాలంటే కొన్ని ప్రధాన విషయాలను దృష్టిలో వుంచుకోవాలి.
పరీక్షల ముందు వుండే కొన్ని రోజుల సమయం అతి ముఖ్యమైనది. విద్యా సంవత్సరంలో చదివిన వివిధ అంశాలను ఈ కొన్ని రోజుల్లో పునర్విమర్శ చేసుకోవాలి. అన్ని పాఠాలను ఒకసారి చూసుకోవడమేగాక, ప్రధానమైన పాఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పరీక్షల్లో తరచుగా అడిగే ముఖ్యమైన ప్రశ్నలతోపాటు ఉపాధ్యాయులు యిచ్చిన సూచనలనుబట్టి ముఖ్యాంశాలను నిర్ణయించుకోవాలి. వీటిలో కొన్ని ప్రశ్నలు ఎంపిక చేసుకొని పరీక్షా వాతావరణంలో ప్రాక్టిస్ కూడా చేయాలి. దీనివల్ల సమయపాలన (టైం మేనేజ్‌మెంట్) తెలుస్తుంది. ఇది పరీక్షా హాల్లో సమాధానాలు రాసేటప్పుడు కలిగే ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. మానసిక శాస్త్రం ప్రకారం అంతకుముందే పరిచయం వున్న పని చేయడంలో గాని, ప్రశ్నలకు సమాధానాలు రాయడంలో గానీ ఒత్తిడి తక్కువగా వుంటుంది.
పరీక్ష స్వరూప స్వభావాలను అర్థంచేసుకోవడం కూడా ఈ సమయంలో చాలా ముఖ్యం. ప్రశ్నాపత్రం మార్పు ఎలా వుంటుంది? ఈ రకమైన ప్రశ్నలు ఎన్ని వుంటాయి? మొత్తం కేటాయించిన సమయం ఎంత? ఆయా విభాగాల వారీగా ఎంతేసి సమయం కేటాయిస్తే నిర్ణీత సమయంలో అన్నింటికి సమాధానాలు రాయగల్గుతారు? అనే విషయాలు పరిశీలించి చూసుకోవాలి. విభాగాల వారీగా కేటాయించిన మార్కులు, ఆ విభాగం పూర్తిచేయడానికి పట్టే సమయంపై స్థూలంగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత, ఒక మాదిరి ప్రశ్నాపత్రాన్ని తీసుకొని సమాధానాలు రాసి చూసుకోవాలి. తమ ప్లానింగ్ ప్రకారం సమాధానాలు రాయగల్గుతున్నది, లేనిదీ పరిశీలించి చూసుకోవాలి. దీని ఆధారంగా తమ ప్లానింగ్‌లో అవసరమైన మార్పులు-చేర్పులు చేసుకోవాలి. విద్యార్థులు ఈ సమయంలో గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పరీక్షలు సమీపిస్తున్నకొద్దీ కొత్తకొత్త విషయాలను చదవడం ఆపి, అంతకుముందే చదివిన విషయాలపై దృష్టిపెట్టాలి. బాగా చదివిన అంశాలపై ప్రశ్నలు ఏ రకంగా అడిగినా చేయగలిగేలా సిద్ధంకావాలి. కొత్త విషయాలు ఏవైనా చదవాలనుకుంటే, బాగా ముఖ్యమన్పించిన విషయాలు మాత్రమే చదవాలి. అది కూడా చదివిన విషయాల ‘రివిజన్’ పూర్తయిన తర్వాతే చేయాలి.
ఈ సమయంలో ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా చదివే ప్రయత్నం చేయాలి. శారీరకంగా, మానసికంగా తగినంత విశ్రాంతి అవసరం. నిద్ర బాగా తగ్గించుకోవడం, సరైన విశ్రాంతి తీసుకోకపోవడంవల్ల మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. శక్తిసామర్థ్యాలకు మించి శ్రమించి చదవడంవల్ల ఆ సమయంలో బాగా చదువుతున్నట్లు అన్పించినప్పటికీ ఒక పద్ధతి ప్రకారం మెదడులో నిక్షిప్తంకాదు. దీనివల్ల పరీక్ష హాల్లో సమర్థవంతంగా సమాధానాలు రాయలేరు.
వీలునుబట్టి తోటి మిత్రులతో చర్చించడంవల్ల మంచి ప్రయోజనం వుంటుంది. ప్రశ్నాపత్రం రూపురేఖలు విశే్లషించి చూసుకోవడం, సమాధానాలు రాయడంపై ప్లానింగ్ తయారుచేసుకోవడం, ప్లానింగ్‌కు తగ్గట్లుగా రాయగల్గుతున్నదీ, లేనిదీ చూసుకోవడం వంటివి కలిసి చర్చించుకోవడంవల్ల మంచి ఫలితాలు వుంటాయి. దీనివల్ల లోటుపాట్లు గుర్తించడం, సరిచేసుకోవడం సులభమవుతుంది. అయితే యిక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేమిటంటే ఒకరినొకరు ఎవరేం చదివారు? ఇంకా చదవనిదెంత? అని చూసుకొని ఆందోళనకు లోనుకాకూడదు. ఇంతకుముందే చదివింది బాగా రివిజన్ చేయడం, సమయాన్నిబట్టి మాత్రమే కొత్త విషయాలు చదవడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. పరీక్షల ముందు యింట్లో విద్యార్థులకు లభించే వాతావరణం, తల్లిదండ్రులు, యితర పెద్దల ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. ఇంట్లో పిల్లలు ప్రశాంతంగా చదువుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు తల్లిదండ్రులు చేయాలి. బంధువులు, ఇతర సందర్శకులవల్ల పిల్లల చదువుకు ఆటంకం ఏర్పడకుండా చూడాలి. పిల్లలు తమ స్వంత ప్లానింగ్ ప్రకారం వీలైనంత సమయం చదువుకోవడానికే కేటాయించేలా ప్రోత్సహించాలి. కొందరు తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడు ఏం చదవాలి? ఎంతసేపు చదవాలి? అనేది నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. దీనివల్ల పిల్లలపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే తప్పనిసరి అయితే తప్ప పిల్లల ప్లానింగ్‌లో జోక్యం చేసుకోరాదు. ఏయే జాగ్రత్తలు విద్యార్థులు తీసుకోవాలో పదే పదే పెద్దవారు గుర్తుచేయడం కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతుంది. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నట్లుగా అవసరమైనంత వరకు మాత్రమే పెద్దవారు పిల్లల పరీక్ష ప్రిపరేషన్‌లో చేయూతనిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చూడాలి.
-
మంచి ఫలితాలు సాధించడం ఎలా?
ఒక విద్యా సంవత్సరంలో నెలల తరబడి చదివిన చదువును కొన్ని గంటలలో పరీక్షించడానికి వీలుగా రూపొందించినదే పరీక్ష. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడంలో విద్యార్థి చదవడానికి కేటాయించిన సమయం, చదివిన విధానం వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. పరీక్షలకు కొద్ది రోజుల ముందువరకు చదివిన విషయాలను పరీక్ష హాల్లో సమర్థవంతంగా రాయాలంటే చివరి నిమిషంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ముఖ్యమని విద్యార్థులు మరిచిపోరాదు.
పరీక్షలకు ఒకటి రెండు రోజుల ముందు మానసికంగా ఆత్మవిశ్వాసంతో వుంటూ, ప్రశాంతతను అలవర్చుకోవాలి. ఆందోళన చెందరాదు. చదివిన విషయాలను మననం చేసుకుంటూ పరీక్షలు బాగా రాయగలమనే విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఏదైనా విషయాన్ని సరిగ్గా చదవకపోతే దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందడం బదులు, చదివిన వాటిని బాగా ‘రివిజన్’ చేయడంపైనే దృష్టి కేంద్రీకరించాలి. అంటే పరీక్షకు మానసికంగా సిద్ధం కావడం ముఖ్యమని అర్థం.
పరీక్షలు జరిగే ముందురోజు రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కొని చదవడం మంచిది కాదు. సాధారణంగా రోజూ ఎంతసేపు నిద్రకు కేటాయిస్తారో, పరీక్షల సమయంలో కూడా అంతే సమయం నిద్ర అవసరం. సరిగ్గా నిద్ర లేకుండా చదివితే మరుసటి రోజు పరీక్ష హాల్లో సమాచారాన్ని గుర్తుకు చేసుకోవడం, ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా రాయడంలో శరీరం, మనసు సహకరించకపోవచ్చు. మానసిక శాస్త్రం ప్రకారం ఒత్తిడి, శ్రమ ఎక్కువైతే జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. అందుకే విద్యార్థులు నిద్ర, విశ్రాంతి తగినంతగా వుండేలా చూసుకోవాలి.
పరీక్ష రోజు కనీసం 10-15 నిమిషాల ముందు పరీక్ష జరిగే ప్రదేశానికి చేరుకోవాలి. పరీక్షా హాల్లోకి అనుమతించిన తర్వాత ప్రశ్నాపత్రం యిచ్చేలోపు వుండే కొద్ది సమయాన్ని ‘రిలాక్స్’ కావడానికే కేటాయించాలి. ఏం చదవాం? ఏం చదవలేదు? సరిగ్గా చదవని దానిలోనుంచి ప్రశ్నలు వస్తే ఎలా? వంటి విషయాలను యితరులతో చర్చించడం కానీ, మనసులో అనుకుంటూ ఆందోళన చెందడం గానీ చేయరాదు. ప్రశాంతంగా వుండాలి. ఆందోళన, భయం వంటివి జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
ప్రశ్నాపత్రం చేతికందగానే అందలి సూచనలు జాగ్రత్తగా చదవాలి. గతంలో మాదిరి ప్రశ్నాపత్రాలకు సమాధానాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒక ప్లానింగ్ తయారుచేసుకొని వుంటే ఆ ప్లానింగ్ ప్రకారం సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి. మాదిరి ప్రశ్నాపత్రానికి, అసలు ప్రశ్నాపత్రానికి ప్రశ్నల రూపకల్పనల్లో, సూచనల్లో ఏవైనా తేడాలుంటే అప్పటికప్పుడు అందుకు తగ్గట్లుగా ప్లానింగ్ రూపొందించుకొనే ప్రయత్నం చేయాలి. ఆయా విభాగాల వారీగా రాయాల్సిన ప్రశ్నలు ఎంపిక చేసుకోవడం, ప్రాధాన్యత ప్రకారం వాటికి సమాధానాలు రాయడం చేయాలి.
పరీక్ష హాల్లో సమయపాలన అనేది చాలా ముఖ్యం. నిర్దేశిత సమయంలో ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాయగల్గేలా చూసుకోవాలి. ప్రశ్నాపత్రంలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిన అవసరం లేకుండా ‘్ఛయిస్’వున్నప్పుడు ఏదో ఒక విభాగంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలిసినప్పటికీ మొదట అడిగినన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. చివర్లో అదనంగా సమయం వుంటే, రాసిన సమాధానాలన్నీ ఒకసారి సరిచూసుకున్న తర్వాత అదనపు ప్రశ్నలకు సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేమిటంటే, అదనంగా సమాధానాలు రాసేటప్పుడు ఏ విభాగంలోనయితే అంతకుముందు రాసిన సమాధానాలు ప్రభావవంతంగా లేకపోతే ఆ విభాగంలోనించి అదనంగా రాయడం మంచిది.
సమాధానాలు రాసేటప్పుడు నిర్దేశించిన దానికంటే పొడవైన సమాధానాలు రాయడం లేదా క్లుప్తంగా ముగించడం సరికాదు. దీనివల్ల మార్కులు సరిగ్గా రావు. పైగా, సమయం వృధాఅవుతుంది. ఎన్ని లైన్లలో సమాధానం రాయాల్సి వుంటుందో దానికి 10 శాతం అటు యిటుగా సమాధానం ముగించే ప్రయత్నం చేయాలి.
సమాధానాల్లో భాగంగా ఏవైనా పటాలు, డయాగ్రమ్స్ వేయాల్సిన అవసరం వుంటే వాటిపై అనవసరంగా సమయాన్ని వృధాచేసుకోరాదు. ఒక ‘చిత్రకారుని’వలె విద్యార్థినుంచి పటాలను ఎగ్జామినర్లు ఆశించరు. ‘కానె్సప్ట్’కు తగ్గట్లుగా పటాలు అర్థవంతంగా వుంటే సరిపోతుంది. సరియైన పరిమాణంలో సరియైన వివరాలతో పటాలు గీస్తే సరి.
చేతి రాత విషయంలో విద్యార్థులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎగ్జామినర్ సమాధాన పత్రాల్ని చదవడానికి వీలుగా చేతిరాత వుండాలి. కొట్టివేతలు, దిద్దివేతలు లేకుండా చూసుకోవాలి. పదానికి పదానికి మధ్య, వాక్యానికి వాక్యానికి మధ్య తగినంత ఖాళీ వుండాలి. ప్రశ్నల సంఖ్యలు, విభాగాల సంఖ్యలు/ పేర్లు ప్రశ్నాపత్రంలో యిచ్చినట్లుగానే రాయాలి. స్వంతంగా సంఖ్యలు వేయరాదు.
ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాయడం పూర్తయ్యాక కనీసం 5 నిమిషాలపాటు సమాధానపత్రాన్ని పరిశీలించి చూసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ మొదలు యితర వివరాలు సరిగ్గా రాసిందీ లేనిదీ ‘చెక్’ చేసుకోవాలి. ప్రశ్నల సంఖ్యలు, విభాగాల సంఖ్యలు సరిచూసుకోవాలి. ఏవైనా పొరపాట్లు దొర్లితే సరిచేసుకోవాలి. ఆరోజే పరీక్ష రాయడం పూర్తయ్యాక, ఇక దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మరుసటిరోజు పరీక్షపై దృష్టి పెట్టాలి.
No comments:
Post a Comment