Thursday, June 16, 2011

మౌర్య సామ్రాజ్యం.. స్థితిగతులు.. అశోకుని దర్మం

భారతదేశ చరిత్రలో తొలి సామ్రాజ్య నిర్మాతలు మౌర్యులే. గత రాజవంశాల చరిత్రతో పోలిస్తే, మౌర్యుల చరిత్రకు ఆధారాలు అనేకం. బౌద్ధ, జైన గ్రంథాలు, గ్రీకు రచనలు, కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’ పురావస్తు ఆధారాలు, అశోకుని శాసనాలు మౌర్యుల చరిత్రను తెలుసుకోవడానికి ఎంతో ఉపకరిస్తాయి.


చంద్రగుప్త మౌర్యుడు:
చివరి నందపాలకుడైన ధననందుడ్ని తొలగించి మౌర్య వంశ అధికారాన్ని స్థాపించాడు చంద్రగుప్తుడు. కౌటిల్యుడు (చాణక్యుడు) అనే బ్రాహ్మణుడి సహాయంతో చంద్రగుప్తుడు అధికారంలోకి వచ్చాడనే అభిప్రాయంభారతదేశంలో విస్తృత ప్రచారం పొందింది. చంద్రగుప్తుని జీవితంలోని తొలి దశ గురించి స్పష్టమైన ఆధారాలు లేవు. గుప్తుల కాలంలో విశాఖదత్తుడు రాసిన‘ముద్రారాక్షసం’ చంద్రగుప్తుడిని ‘కులహీనుడని’ పేర్కొంది. పిప్పలివనంలో నెమళ్లను పెంచుతూ జీవించే ‘మోరియా’ అనే ‘క్షత్రియ’ తెగకు చెందిన వాడని బౌద్ధమత సాహిత్యం చెబుతోంది.

అలెగ్జాండర్ నిష్ర్కమణ తర్వాత చంద్రగుప్తుడు వాయవ్య భారతదేశానికి వెళ్లి, గ్రీకులను పారదోలి తన అధికారాన్ని స్థాపించాడని గ్రీకు రచనలు పేర్కొంటున్నాయి (గ్రీకు రచయితలు చంద్రగుప్తుడిని ‘సాండ్రకొట్టస్’ అని ప్రస్తావించారు). క్రీ.పూ. 305లో అలెగ్జాండర్ సేనానుల్లో ఒకడైన సెల్యుకస్ నికేటర్ చంద్రగుప్తునితో చేసిన యుద్ధం.. సంధి, వివాహ సంబంధంతో ముగిసినట్లు తెలుస్తోంది.

ఫలితంగా చంద్రగుప్తునికి పరోపనిసదై(కాబూల్), అరఖోసియా(కాందహార్), గెడ్రోసియా(బెలూచిస్థాన్), ఏరియా(హీరట్) ప్రాంతాలు దక్కాయి. అయితే ఇక్కడ ఎవరి కుమార్తెను ఎవరు పెళ్లాడారనే విషయంపై స్పష్టత లేదు. సెల్యుకస్ రాయబారిగా మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఎన్నో ఏళ్లు జీవించి, భారతదేశమంతటా విస్తృతంగా పర్యటించాడు. అప్పటి పరిస్థితుల ఆధారంగా మెగస్తనీస్ రాసిన గ్రంథం అదృశ్యమైనప్పటికీ.. తదనంతర రచయితలు స్ట్రాబో, డియోడోరస్, ఎరియన్, ప్లినీ రచనల్లో ఉల్లేఖనాల రూపంలో అది లభిస్తోంది. దీనికి ‘ఇండికా’ అని పేరు వచ్చింది.

జైన గ్రంథాల ప్రకారం.. చంద్రగుప్తుడు తన జీవిత చరమాంకంలో జైనాన్ని స్వీకరించి, అధికారాన్ని తన కుమారునికి అప్పగించాడు. భద్రబాహుల తదితర జైన సన్యాసులతో కలసి దక్షిణాదిన మైసూరు సమీపంలోని శ్రావణ బెళగొళకు చేరుకున్నాడు. అక్కడే చంద్రగుప్తుడు ‘సల్లేఖన’ అనే జైన ఆచారం(ఆమరణ ఉపవాసదీక్ష) ప్రకారం దేహాన్ని శుష్కింప చేసుకుని మరణించాడని తెలుస్తోంది.

బిందుసారుడు:
చంద్రగుప్తుని అనంతరం క్రీ.పూ. 298-97లో మౌర్య సింహాసనాన్ని అధిష్టించాడు. గ్రీకులు ఇతడిని ‘అమిట్రోఖేటస్’ అని పిలిచేవారు(సంస్కృత ‘అమిత్రఘాత’కు గ్రీకు రూపమే అమిట్రోఖేటస్). సిరియా పాలకుడైన మొదటి ఏంటియోఖస్‌తో ఇతడు సంబంధాలు నెరిపినట్లు తెలుస్తోంది. బిందుసారుడికి భిన్నమైన ఆసక్తులు, అభిరుచులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక సారి ఇతడు తనకు తీపిమధువును, అత్తిపండ్లను, ఒక త త్వవే త్తను పంపాలని ఏంటియోఖస్‌ను కోరగా.. తత్వవేత్తను ఎగుమతి చేయడం తమ దేశాచారం కాదని ఏంటియోఖస్ బదులిచ్చాడు. ఇతని కాలంలో తక్షశిలలో తలెత్తిన తిరుగుబాటు అణిచివేసేందుకు తన కుమారుడైన అశోకుడిని పంపాడు. బిందుసారుడు దక్షిణ భారతాన్ని కూడా జయించి ఉంటాడని 16వ శతాబ్ధంలో భారతదేశంలో పర్యటించిన తారానాథ్ అభిప్రాయపడ్డారు. కానీ ఇందుకు స్పష్టమైన ఆధారాలు లేవు.

అశోకుడు(క్రీ.పూ.269-232):
సుమారు ఒక వంద ఏళ్ల క్రితం వరకు అశోకుడు పురాణాల్లో పేర్కొన్న ఒక సందేహాస్పదమైన రాజు మాత్రమే. 1837లో జేమ్స్ ప్రిన్సెప్ బ్రాహ్మీలిపిని అర్థవంతంగా చదవడంతో ‘దేవానాం పియదస్సి(దేవతలకు ప్రియమైన వాడు)’ అనే ఒక రాజు ఉన్నట్లు తెలిసింది. తర్వాత ఆ రాజుకు సంబంధించిన అనేక శాసనాలు వెలుగులోకి వచ్చాయి.

1915లో వెలుగుచూసిన ఒక శాసనంతో అశోకుడినే ‘దేవానాం పియదస్సి’గా పేర్కొన్నారనే విషయం స్పష్టమయింది. ఆ తర్వాత సింహళ గ్రంథమైన ‘మహావంశ’ను పరిశీలించగా శాసనాల్లో‘దేవానాం పియదస్సి’గా ప్రస్తావించిన వ్యక్తి, మౌర్య చక్రవర్తి అశోకుడు ఒక్కరే అని నిర్థారణ అయింది.

అశోకుడి జీవితంలోని దశ గురించి ఎన్నో కథలు, గాథలు ఉన్నాయి. బౌద్ధ సాహిత్యం ప్రకారం అతడు తన 99 మంది సోదరులను చంపి సింహాసనాన్ని చేపట్టాడు. అశోకుడు క్రీ.పూ. 273లో అధికారంలోకి వచ్చినా క్రీ.పూ.269లో పట్టాభిషేకం చేసుకోవడానికి..ఆ మధ్య కాలంలో అతడు సోదరులను ఆధిపత్యపోరులో వధించడమే కారణమై ఉండొచ్చని కొందరు చరిత్రకారులు భావించారు. అయితే సోదరుల కుటుంబాలు క్షేమంగా ఉన్నట్లు అతని శాసనాలు తెలియజేస్తున్నాయి.

అశోకుడి జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టం క్రీ.పూ. 261లో జరిగిన కళింగ యుద్ధం. ఉత్తర భారతదేశానికి, తూర్పు తీరానికి మధ్య స్వతంత్రంగా, కంటకంగా ఉన్న కళింగను తన సామ్రాజ్యంలో కలపాలనుకున్నాడు. ఆ యుద్ధం తనలో కలిగించిన పరివర్తన గురించి స్వయంగా 13వ శిలాశాసనంలో చెప్పుకున్నాడు. ఆ యుద్ధంలో లక్ష మంది మరణించారని, లక్షన్నర మంది ఖైదీలుగా పట్టుబడ్డారనీ, ఇంకెందరో వికలాంగులయ్యారని తన బాధను ప్రకటించాడు.

ఆ యుద్ధం అతడ్ని పూర్తిగా కదిలించి వేయగా.. వెనువెంటనే, నాటకీయంగా బౌద్ధాన్ని స్వీకరించాడని కొందరు భావించారు. కాని కళింగ యుద్ధం జరిగిన రెండున్నరేళ్ల తర్వాత బౌద్ధం పట్ల అమితాసక్తిని ప్రదర్శించినట్లు అతని శాసనమొకటి తెలియజేస్తుంది. అశోకుని పాలనాకాలంలోనే పాటలీపుత్రంలో 3వ బౌద్ధ సంగీతి జరిగింది. కానీ ఆ సంగీతితో అశోకునికి సంబంధమున్నట్లు అతని శాసనాలే వీ ప్రస్తావించట్లేదు.

అశోకుని ధమ్మం:
అశోకుని శాసనాలను బట్టి అతడు తన ప్రజల యోగక్షేమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవాడ నీ, అతని ధమ్మం(ధర్మం అనే మాటకు పాలీరూపం ధమ్మం) కేవలం బౌద్ధం కాదనీ, అది ఒక ప్రత్యేకమైన నైతిక ప్రవర్తనా నియమావళి అనీ తెలుస్తోంది. భూతదయ కలిగి ఉండి, అహింసను పాటించాలనీ, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, గురువుల పట్ల విధేయత కలిగి ఉండాలనీ, పరమత సహనాన్ని పాటించాలనీ బోధించాడు. ద మ్మ ప్రచారం కోసం అశోకుడు జన సమ్మర్దం ఉండే ప్రాంతాలు, రహదారుల కూడళ్లలో శిలా శాసనాలు వేయించాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ధమ్మ మహామాత్రులు’ అనే ఉద్యోగులను నియమించాడు.

అశోకుని ధమ్మం కేవలం ఒక నైతిక నియమావళి మాత్రమే కాదనీ, అదొక సామ్రాజ్యవాద సాధనం అనీ ప్రముఖ చరిత్రకారురాలు రోమిల్లా థాపర్ అభిప్రాయం. అశోకుని సామ్రాజ్యం ఎంతో విస్తృతమైంది. అస్సాం, తమిళ ప్రాంతాలు మినహాయించి మిగతా భారతదేశమంతా అతని సామ్రాజ్యంలో భాగమైంది. సామాజికంగా, సాంస్కృతికంగా ఎంతో వైవిధ్యంతో కూడుకున్న సామ్రాజ్యమిది. ఇందులో పూర్తిగా ఆర్యీకరించిన ప్రాంతాలు, నాగరికత అప్పుడే ప్రవేశిస్తున్న ప్రాంతాలు, అసలు నాగరికత ఊసే తెలియని ప్రాంతాలు ఉన్నాయి.

వర్ణవ్యవస్థ ఘనీభవించిన ప్రాంతాలతోపాటు, ఎలాంటి సామాజిక భేదాలు లేని గిరిజన సమాజాలు కూడా కనిపించేవి. సామ్రాజ్య వాయవ్య ప్రాంతాల్లో నివశిస్తున్న గ్రీకు సమాజంలో యజమానులు-బానిసలు అనే రెండు రకాల సామాజిక తారతమ్యాలు మాత్రమే ఉండేవి. ఈ నేపథ్యంలో సామాజిక తారతమ్యాలకు అతీతంగా అందరినీ కలిపి ఉంచే ఐక్యతా సూత్రంగా ధమ్మం పని చేసేది.

అశోకుని మతం కళలకు ప్రోత్సాహమిచ్చింది. అతడు 84,000 స్థూపాలు నిర్మించాడని బౌద్ధ సాంప్రదాయం చెబుతోంది. ఆ నాటి కళకు మంచి ఉదాహరణలు-అశోకుడు నిలిపిన ఏకశిలా స్థంభాలు, వాటిపైన గల జంతు మకుటాలు. మౌర్య స్థంభాలన్నీ చునార్ వద్ద లభించే ఇసుకరాయితో రూపొందించినట్లు తెలుస్తోంది. అశోకుడి వారసుడు దశరధుడు బరాబర్, నాగార్జుని కొండల్లో(బీహార్) గుహాలయాలను తొలిపించాడు.

సామ్రాజ్యంలో పరిస్థితులు:
మౌర్యులు విస్తృతమైన కేంద్రీకృత వ్యవస్థను రూపొందించారు. ప్రజాజీవితంలోని ప్రతి ముఖ్య అంశాన్ని ఉద్యోగిస్వామ్యం ద్వారా నియంత్రించే ప్రయత్నం చేశారు. వీరి కాలంలో 18 మంది తీర్థులు, 27 మంది అధ్యక్షులు ఉన్నట్లు కౌటిల్యుడు పేర్కొన్నాడు. వీరిలో ఎక్కువ మంది ఆర్థిక విధులకు సంబంధించిన వారు.
మౌర్య ప్రభుత్వం స్వయంగా అనేక ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడం విశేషం.

వ్యవసాయాభివృద్ధి కోసం ఎన్నో కొత్త గ్రామాలు ఏర్పరచి, వాటిలో శూద్రులకు ఆవాసాలు కల్పించి, వారిని రైతులుగా మార్చేందుకు కృషి చేసింది. ప్రభుత్వ భూముల్లో వ్యవసాయ పర్యవేక్షణ కోసం ‘సీతాధ్యక్ష’ అనే అధికారిని నియమించారు. నీటిపారుదల సౌకర్యాల పట్ల శ్రద్ధ చూపేవారు. చంద్రగుప్తుని కాలంలో గుజరాత్ గవర్నర్ అయిన పుష్యగుప్తుడు గిర్నార్ వ ద్ద సుదర్శన తటాకాన్ని నిర్మించాడు.

మౌర్యులు వాణిజ్య వికాసం కోసం కృషి చేశారు. ద్రవ్య ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహిమిచ్చారు. ఇప్పటి వరకు లభించిన విద్ధాంక నాణేల్లో (punchmarked coins) అత్యధిక శాతం మౌర్య యుగానికి చెందినవే. వాణిజ్యం, పరిశ్రమలకు సంబంధిత విభాగాలపై ప్రభుత్వ నియంత్రణ నెలకొల్పారు. ‘పణ్యాధ్యక్ష’ అనే అధికారి వాణిజ్యాన్ని పర్యవేక్షించగా... ‘పౌతవాధ్యక్ష’ తూనికలు, కొలతలకు సంబంధించిన విధులను నియంత్రించేవాడు.

నదీ రవాణా కోసం ‘నవాధ్యక్ష’... ర హదారులపై సుంకాలను వసూలు చేసేందుకు ‘శుల్కాధ్యక్ష’ వంటి అధికారులు ఉండేవారు. మౌర్య ప్రభుత్వం గనులు, లోహసంగ్రహణంపై గుత్తాధిపత్యం వహించింది. ఈ వ్యవహారాలను ‘అకరాధ్యక్ష’ పర్యవేక్షించేవాడు.

స్థిర నివాసాలు, వ్యవసాయం ఏర్పడిన ప్రాంతాల్లో సామాజిక నిర్మాణం స్థూలంగా వర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉండేది. మెగస్తనీస్ భారతీయ సమాజంలో-తత్వవేత్తలు, రైతులు, సైనికులు, పశుపాలకులు, హస్తకళాకారులు, న్యాయమూర్తులు, కౌన్సిలర్లు అనే ఏడు కులాల వారున్నారని పేర్కొన్నాడు. అతడు వృత్తులనే కులాలుగా భావించడం వల్ల ఇలా జరిగింది. అదేవిధంగా భారతదేశంలో బానిసలు లేరని కూడా అభిప్రాయపడ్డాడు. కానీ వాస్తవానికి బౌద్ధ గ్రంథాల్లో, అర్థశాస్త్రంలో బానిసల ప్రస్తావన ఉంది.

సైద్ధాంతికంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు శూద్రుల కంటే అధిక గౌరవం ఉండేది. కానీ తొలిసారిగా మౌర్యులు అప్పటి వరకు వ్యవసాయ కూలీలుగా ఉన్న శూద్రులకు భూమిచ్చి వారు రైతులుగా ఎదిగేందుకు దోహదపడ్డారు.

ఈ నాలుగు వర్ణాలతోపాటు కౌటిల్యుడు 15 మిశ్రమ కులాలను కూడా ప్రస్తావించాడు. వీరంద రినీ స్థూలంగా ‘అంత్యావసాయిన్(ఆఖరున నివసించే వారు అని అర్థం)’గా వ్యవహరించాడు. చండాల, స్వపక వంటి మిశ్రమకులాలు అస్పృశ్య కులాలుగా పరిగణించేవారు.

మౌర్యయుగంలో బౌద్ధం ఉచ్చదశను అనుభవించింది. అశోకుని శాసనాలు జైనులను ‘నిర్గ్రంథులు’ పేరిట ప్రస్తావించాయి. అర్థశాస్త్రంలో జైనుల ప్రస్తావన మచ్చుకైనా లేదు. అజీవకులు తగిన ప్రాచుర్యాన్ని పొందినట్లు తెలుస్తోంది. అశోకుడు అతని మనమడు దశరథుడు అజీవకుల కోసం బీహార్‌లోని నాగార్జున కొండల్లో గుహలు తొలిపించడం విశేషం.

మౌర్య వంశ పతనం:
అశోకుని పాలానా కాలం చివరి దశలో సామాజ్య్రం బలహీనపడటం మొదలైంది. అతని ధమ్మం లక్ష్య సాధనలో విఫలమైంది. సాంఘిక ఉద్రిక్తతలు కొనసాగాయి. క్రీ.పూ. 232లో అశోకుని మరణంతో మౌర్య సామ్రాజ్యం వేగంగా పతనమవసాగింది. అతని వారసులు సామాజ్రాన్ని పశ్చిమ, తూర్పు భాగాలుగా విభజించినట్లు తెలుస్తోంది. పశ్చిమ భాగాన్ని కునాలుడు, సంప్రతి వంటి వారు పాలించగా..వాయవ్య భాగాన్ని క్రమంగా బాక్ట్రియన్ గ్రీకులు ఆక్రమించారు. దక్షిణాదిన శాతవాహనులు క్రమంగా బలోపేతులై అధికారాన్ని స్థాపించారు.

పాటలీ పుత్రం రాజధానిగా సామ్రాజ్యపు తూర్పు భాగం కొంతకాలం మౌర్యుల అధికారంలోనే కొనసాగింది. మౌర్యుల్లో చిట్టచివరి వాడు బృహద్రథుడు. క్రీ.పూ. 181లో బృహద్రథుడిని తొలగించి, అతని బ్రాహ్మణ సేనాని పుష్యమిత్ర శుంగుడు అధికారంలోకి వచ్చాడు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Followers