Thursday, June 16, 2011

కరెంట్ అఫైర్స్

రాష్ట్రీయం

ఉప ముఖ్యమంత్రిగా రాజనర్సింహ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నియమితుల య్యారు. మెదక్ జిల్లా ఆందోల్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన రాష్ట్రానికి ఆరో ఉప ముఖ్యమంత్రి. చివరి సారిగా 1994లో కోనేరు రంగారావు డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. 1960-62 మధ్య కె.వి. రంగా రెడ్డి తొలిసారి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

...........................

జాతీయం

అమెరికాతో అతి పెద్ద రక్షణ ఒప్పందం
అమెరికాతో అతి పెద్ద రక్షణ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం జూన్ 6న ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం విలువ * 18 వేల కోట్లు. దీని ద్వారా అమెరికా నుంచి పది సీ-17 భారీ రవాణా సైనిక విమానాలను కొనుగోలు చేస్తారు. 4 ఇంజిన్లు ఉండే సీ-17 విమానం రెండు టీ-90 యుద్ధ ట్యాంకులను, శతఘు్నలను మోసుకెళ్తుంది. రవాణా సామాగ్రిని, 130 మంది సైనికులను కూడా తరలిస్తుంది. కమ్యూనికేషన్ సాధనంగానూ ఉపయోగపడుతుంది.

భారత్ 2009లో పీ-8ఐ రకానికి చెందిన విమానాలను కొనుగోలు నిమిత్తం అమెరికాతో *9వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. దీని తర్వాత ఆ దేశంతో కుదిరిన అతిపెద్ద రక్షణ ఒప్పందం సీ-17 విమానాలదే.

డార్జిలింగ్‌కు నూతన పాలకమండలి ఏర్పాటు
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ ప్రాంతంలో నూతన పాలక మండలి ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం, గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) మధ్య జూన్ 7న అధికారిక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ప్రస్తుతమున్న డార్జిలింగ్ హిల్ కౌన్సిల్(డీజీహెచ్‌సీ) స్థానంలో మరింత స్వయం ప్రతిపత్తితో ఎన్నికల ద్వారా నూతన పాలక మండలి ఏర్పాటవుతుంది. ఆర్థిక, పాలానాధికారాలను కలిగి ఉంటుంది. దీంతో ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తమ డిమాండ్‌కు స్వస్తి పలికినట్లు జీజేఎం ప్రకటించింది.

నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్‌కు కేబినెట్ ఆమోదం
నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్(నాట్ గ్రిడ్) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ జూన్ 6న ఆమోదం తెలిపింది. విదేశాల నుంచి ఎదురయ్యే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, భద్రతా సంస్థల మధ్య సమాచార మార్పిడికి నాట్ గ్రిడ్ తోడ్పడుతుంది. రైల్వే, విమాన ప్రయాణం, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్, వీసా, ఇమ్మిగ్రేషన్ రికార్డుల వంటి 21 కేటగిరీల సమాచారాన్ని నాట్ సేకరిస్తుంది. ఈ అంశాలను ఈడీ, సీబీఐ, ఐబీ వంటి 11 సంస్థలకు అందుబాటులో ఉంచుతుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చేపట్టే ఈ పథకానికి * 4 వేల కోట్లు ఖర్చవుతాయి.

భారత్‌లో 50 శాతం తగ్గిన హెచ్‌ఐవీ
భారత్‌లో 2001-09 మధ్యకాలంలో కొత్తగా హెచ్‌ఐవీ కేసుల నమోదు 50 శాతం తగ్గిందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. జూన్ 4న ‘ఎయిడ్స్ అట్ 30: నేషన్స్ అట్ ది క్రాస్ రోడ్స్’ పేరిట విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త ఇన్ఫెక్షన్స్ 25 శాతం మేర తగ్గాయి.

వృద్ధాప్య పెన్షన్ వయో పరిమితి తగ్గింపు
ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ వయోపరిమితిని కేంద్రం 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. దీని వల్ల 72.32 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. అలాగే 80 ఏళ్లు దాటిన వారికిచ్చే పెన్షన్‌ను *200 నుంచి 500 వరకు పెంచారు. అదే విధంగా 2013-14 నాటికి రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన పథకం కింద 55 లక్షల మంది బీడీ కార్మికులకు వైద్య బీమా కల్పించాలని కూడా కేంద్రం నిర్ణయించింది.

పృథ్వీ-2 పరీక్ష విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఉపరితలం నుంచి ఉపరితలం మీదకి ప్రయోగించే పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. జూన్ 9న ఒడిషాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇది 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. 500-1000 కిలోల వార్‌హెడ్లను మోసుకు వెళ్లగలదు.

జాతీయ తయారీ విధానానికి ఆమోదం
జాతీయ తయారీ విధానానికి ప్రధాని నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జూన్ 9న ఆమోదం తెలిపింది. ఈ విధానంలోని ముఖ్యాంశాలు.. నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఏర్పాటు; 2025 నాటికి భారత స్థూల జాతీయోత్పత్తిలో తయారీ రంగం వాటాను 25శాతానికి పెంచడం(ప్రస్తుతం ఇది 15-16 శాతంగా ఉంది); 10 కోట్ల ఉద్యోగాల సృష్టి.

యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కాబ్రా ప్రారంభం
యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కాబ్రాను జూన్ 8న కొచ్చిలో వైస్ అడ్మిరల్ కె.ఎన్. సుశీల్ ప్రారంభించారు. సముద్ర భద్రతకు ఉద్దేశించిన ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ తరహాకు చెందిన పదో నౌక ఇది. దీన్ని కోల్‌కతాలోని గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మించింది.

..............................

వార్తల్లో వ్యక్తులు

కాంపిటీషన్ కమిషన్ చైర్మన్‌గా చావ్లా
కాంపిటీషన్ కమిషన్ చైర్మన్‌గా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అశోక్ చావ్లా పేరు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూన్ 6న ప్రతిపాదించింది. ప్రస్తుత చైర్మన్ దానేంద్ర కుమార్ పదవీ కాలం జూన్ 5న ముగియడంతో కొత్త చైర్మన్‌ను ఎంపిక చేశారు. అత్యంత విలువ గల సంస్థల విలీనం, కొనుగోలు వ్యవహారాలు, పోటీని దెబ్బతీసే గుత్తాధిపత్య విధానాలను అరికట్టడం, మార్కె ట్లో పోటీని నెలకొల్పడం వంటివి ఈ కమిషన్ విధులు. దీన్ని 2003లో మోనోపోలిస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కమిషన్ స్థానంలో ఏర్పాటు చేశారు.

టీ ఒబ్రెత్‌కు ఆరెంజ్ ప్రైజ్
సెర్బియన్ అమెరికన్ రచయిత్రి టీ ఒబ్రెత్(25)కు ఆరెంజ్ ప్రైజ్- 2011 దక్కింది. ‘ది టైగర్స్ వైఫ్’ నవలకుగాను ఈ పురస్కారం లభించింది. ఇది ఈమె తొలి నవల. అవార్డు పొందిన పిన్న వయస్కురాలు కూడా. ఇంగ్లిష్ భాషలో రాసిన ఫిక్షన్ నవలకు అందజేసే ఈ అవార్డును 1996లో నెలకొల్పారు.

నటరాజ రామకృష్ణ మృతి
ప్రముఖ నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ(88) జూన్ 7న హైదరాబాద్‌లో అనారోగ్యంతో మరణించారు. సంప్రదాయ నృత్యరీతులను అధ్యయనం చేసి ‘ఆంధ్రనాట్యం’, 700 ఏళ్ల నాటి ‘పేరిణి శివతాండవం’ వంటి నాట్యాలకు ఆయన జీవం పోశారు. మహారాష్ట్రలోని బందార రాజా గజపతి పాండ్య ఆయనను 18వ ఏట ‘నటరాజ’ బిరుదుతో సత్కరించడంతో ఆయన ‘నటరాజ రామకృష్ణ’గా ప్రాచుర్యం పొందారు. ఈయన 1923 మార్చి 21న ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో జన్మించారు.

చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ మృతి
ప్రముఖ చిత్రకారుడు మఖ్బూల్ ఫిదా (ఎం.ఎఫ్.) హుస్సేన్(96) లండన్‌లో జూన్ 9న అనారోగ్యంతో మరణించారు. హిందూ దేవతలను అసభ్యకరంగా చిత్రించడంతో భగ్గుమన్న ఆగ్రహజ్వాలల ఫలితంగా..ఆయన 2006 నుంచి లండన్, దుబాయ్‌లలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. గతేడాది ఖతార్ ప్రభుత్వం ఆయనకు పౌరసత్వం కూడా ఇచ్చింది. 1915లో సెప్టెంబర్ 17న మహారాష్ట్రలోని పండరీపురంలో హుస్సేన్ జన్మించారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ (1955), పద్మభూషణ్(1973), పద్మవిభూషణ్(1991) బిరుదులతో సత్కరించింది. 1986లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఫోర్బ్స్ పత్రిక హుస్సేన్‌ను ‘ఇండియన్ పికాసో’గా అభివర్ణించింది.

................................

క్రీడలు

లియోన్ మాస్టర్స్ విజేత ఆనంద్
లియోన్ మాస్టర్స్ చెస్ టైటిల్‌ను భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గెలుచుకున్నాడు. లియోన్‌లో జూన్ 5న జరిగిన ఫైనల్లో ఆనంద్ స్పెయిన్‌కు చెందిన అలెక్సీ శిరోవ్‌ను ఓడించాడు.

గెర్రీ వెబర్ ఓపెన్
గెర్రీ వెబర్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జర్మనీకి చెందిన ఫిలిఫ్ కోల్ స్క్రెబెర్ గెలుచుకున్నాడు. హాలెలో జూన్ 12న జరిగిన ఫైనల్లో ఫిలిఫ్ పెట్జ్‌నెర్‌ను ఓడించాడు. పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న(భారత్), ఐజామ్ ఖురేషీ(పాకిస్థాన్)జోడీ విజేతగా నిలిచింది. ఈ జోడీ రాబిన్ హాస్(నెదర్లాండ్స్), రావ్‌నిక్(కెనడా)లపై విజయం సాధించారు
.
ప్రపంచ కప్ ఆర్చరీలో భార త్‌కు రజతం
ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నీలో భారత జట్టు రజతం గెలుచుకుంది. టర్కీలో జరుగుతున్న పోటీల్లో మిక్స్‌డ్ టీం విభాగంలో జతయంత తాలుక్‌దార్-దీపిక కుమారి జోడీ రజత పతకం సాధించింది.

.........................................

అంతర్జాతీయం

భారత్-నేపాల్ మధ్య ఎన్నికల నిర్వహణ ఒప్పందం
ఎన్నికల నిర్వహణలో సహకారానికి సంబంధించి భారత్-నేపాల్‌ల మధ్య జూన్ 7న ఒప్పందం కుదిరింది. నిర్దేశిత అవగాహన పత్రాలపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషి, నేపాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ నీల్ కాంత్ సంతకాలు చేశారు. దీని ప్రకారం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పరికరాలు, శిక్షణ, ఓటింగ్, టెక్నాలజీ, ఓటర్లలో అవగాహన కల్పించడం వంటి అంశాలను పరస్పరం పంచుకుంటారు. ఇప్పటికే భారత్ నేపాల్‌కు ఓటింగ్ యంత్రాలకు సాంకేతిక సహాయాన్ని అందించింది.

ప్రపంచంలో 15శాతం మందికి వైకల్యం
ప్రపంచ జనాభాలో 15శాతం మంది (1970లో వీరి జనాభా 10 శాతంగా ఉండేది)వైకల్యంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా జూన్ 9న విడుదల చేసిన నివేదిక పేర్కొం ది. ఈ నివేదిక ప్రకారం ప్రతి ఐదుగురిలో ఒకరు తీవ్ర వైకల్యంతో బాధపడుతున్నారు. వృద్ధాప్యంతోపాటు మదుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, మానసిక అనారోగ్యం, సాయుధ హింస, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాలు వైకల్యానికి కారణమవుతున్నాయని నివేదిక తెలిపింది.

ఈ-కొలీ బ్యాక్టీరియా జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్తలు
ఇటీవలి కాలంలో జర్మనీ, యూరప్‌లో 18 మంది మరణానికి కారణమైన హిమోలిటిక్ యురిమెక్ సిండ్రోమ్ వ్యాధి కారక ఈ-కొలీ(ఎశ్చరీషియో కొలీ 2014) బ్యాక్టీరియా జన్యువులను చైనా, జర్మనీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గత కొన్ని దశాబ్దాల కాలంలో ఈ-కొలీ బ్యాక్టీరియాలన్నింటి కంటే దీన్నే అత్యంత ప్రమాదకరమైందిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.యాంటీ బయోటిక్ చికిత్సకు లొంగని హిమోలిటిక్ యురిమెక్ సిండ్రోమ్ వ్యాధి దోసకాయ, క్యాబేజీ, టమోటా వంటి కూరగాయల నుంచి సంక్రమిస్తుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Followers