Wednesday, June 15, 2011

మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావం- పద్ధతులు

విజ్ఞానాన్ని ఒక శాస్ర్తియ పద్ధతిలో నేర్పడానికి ఉపయోగపడే వ్యవస్థ పాఠశాల. పాఠశాల నిర్వహణా సౌలభ్యంకోసం రూపొందించబడినదే తరగతి గది. తరగతి గదికి కేంద్ర బిందువు విద్యార్థి. ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు, తాత్వికుడు, స్నేహితుడుగా వ్యవహరించవలసి ఉంటుంది.
* అభ్యసన సిద్ధాంతాలు, సూత్రాలను విద్యా విషయాలకు అన్వయించడం ద్వారా ఉపాధ్యాయుడు తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించగలుగుతాడు. మనో విజ్ఞాన శాస్త్రం ఉపాధ్యాయునికి తన బోధనలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి, బోధనా నిర్ణయాలను తీసుకోవడానికి తోడ్పడుతుంది.
* వడ్రంగికి కర్ర స్వభావం, కుమ్మరికి మట్టి స్వభావం తెలిసి ఉండాలి. అలాగే ఉపాధ్యాయునికి మానవ ప్రవర్తనా స్వభావం తెలియాలి. ఈ మానవ ప్రవర్తనా స్వభావమును తెలిపేది మనోవిజ్ఞానశాస్త్రం.
* ఒక వ్యక్తి విభిన్న పరిస్థితులలో వివిధ రకాలుగా స్పందిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ వైవిధ్య స్పందనలలో కూడా ఒక క్రమ పద్ధతి ఉన్నట్లు మనకు తెలుస్తుంది.
* మానవుని ప్రవర్తనలలో ఉన్నటువంటి తీరులను, వాటి కారణాలను శాస్ర్తియంగా అధ్యయనం చేయడం మనోవిజ్ఞానశాస్త్ర లక్ష్యం. మనో విజ్ఞాన శాస్త్రం ఒక శాస్త్రంగా రూపొంది సుమారు 125 సంవత్సరాలు దాటింది. 19వ శతాబ్దం మధ్యవరకు మనోవిజ్ఞానశాస్త్రం తత్వశాస్త్రంలో భాగంగా ఉండేది.
* ఊంట్ అనే శాస్తవ్రేత్త 1879వ సంవత్సరంలో జర్మనీలోని లీప్‌జిగ్ నగరంలో మనో విజ్ఞానశాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించడంతో మనో విజ్ఞానశాస్త్రం సంప్రదాయబద్ధమైన, స్వతంత్రమైన ఒక వైజ్ఞానిక శాస్త్రంగా ప్రారంభమైనదని చెప్పవచ్చును.
* మనో విజ్ఞాన శాస్త్రాన్ని ఇంగ్లీషులో సైకాలజి (Psychology) అంటారు. సైకాలజి అనే ఫదం సైకీ, లోగోస్ అనే రెండు గ్రీకు పదాల నుండి వచ్చింది. సైకీ అంటే ఆత్మ అని, లోగోస్ అంటే శాస్త్రం లేదా అధ్యయనం అని అర్ధాలున్నాయి.
* ప్లేటో, అరిస్టాటిల్ వంటివారు మనో విజ్ఞానశాస్త్రాన్ని ఆత్మకు సంబంధించిన శాస్తమ్రని భావించారు. ఆత్మ పరిశీలనలకు అందుబాటులో ఉండే మూర్త పదార్థం కాదు. ఆత్మ అనేది అమూర్తం. ఆత్మ ఉన్నదా, ఉన్నట్లయితే దాని స్వభావం ఏమిటి? లాంటి విషయాలు సమస్యా పూరితమైనవి. అందువలన పై నిర్వచనాన్ని శాస్తవ్రేత్తలు ఉపేక్షించారు.
* 19వ శతాబ్దంలో మనో విజ్ఞాన శాస్త్రాన్ని చేతనానికి సంబంధించిన శాస్త్రంగా భావించారు. పరిశీలనలకు అంతఃపరీక్షణ వంటి పద్ధతులను వాడేవారు.
* జాన్ బి.వాట్సన్ అనే శాస్తవ్రేత్త 20వ శతాబ్ది ఆరంభంలో ప్రవర్తనా వాదాన్ని ప్రవేశపెట్టాడు.
* మనో విజ్ఞానశాస్త్రంలో వచ్చిన మార్పులను గమనిస్తూ ఉడ్‌వర్త్ అనే శాస్తవ్రేత్త ‘మనోవిజ్ఞానశాస్త్రం మొదట తన ఆత్మను, తరువాత తన మనస్సును పోగొట్టుకుంది. చివరకు తన చేతనత్వాన్ని కూడా పోగొట్టుకొని, ప్రస్తుతం తన ప్రవర్తనను మాత్రం నిలుపుకుంది’ అని చమత్కరించారు.
మనో విజ్ఞానశాస్త్రం నిర్వచనాలు:-
* ‘మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్తమ్రే మనోవిజ్ఞాన శాస్త్రం’ - ఎడ్విన్ జి.బోరింగ్
* ‘మానవుని ప్రవర్తనను ఇతరులతో అతనికి ఉన్న సంబంధాలను గురించి అధ్యయనం చేసే శాస్తమ్రే మనోవిజ్ఞాననశాస్త్రం. - క్రో అండ్ క్రో.
* ‘జీవుల బాహ్య అనుభవాలనేకాక అంతర్గత ప్రక్రియలను కూడా అధ్యయనం చేసే శాస్తమ్రే మనోవిజ్ఞానశాస్త్రం’. -నార్మన్ యల్.మన్
* ‘వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా నిర్వహించే కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్తమ్రే మనోవిజ్ఞానశాస్త్రం’- ఉడ్‌వర్త్
* ‘మానవ ప్రవర్తనా శాస్తమ్రే మనోవిజ్ఞానశాస్త్రం’- పిల్స్‌బరి
* ‘ప్రవర్తన, అనుభవాల శాస్తమ్రే మనోవిజ్ఞానశాస్త్రం’- స్కిన్నర్
* ‘వ్యక్తి ప్రవర్తనను, అనుభవాలను శాస్ర్తియంగా అధ్యయనం చేసే శాస్తమ్రే- మనో విజ్ఞానశాస్త్రం’అను నిర్వచనం ఉత్తమమైనదిగా చెప్పవచ్చు.
విద్యామనోవిజ్ఞానశాస్త్రం- చరిత్ర
* ప్రాచీన గ్రీకు డెల్ఫీ దేవాలయంపై రాసిన- ‘నిన్ను గురించి నీవు తెలుసుకో’అనే సూక్తి, మనసును దాని స్వభావాన్ని గురించి తెలుసుకోవడానికి మానవుడు మొదటినుండి ప్రయత్నిస్తున్నాడనడానికి నిదర్శనం.
* సోక్రటీస్ (469- 399 బిసి)
* మొదటిసారిగా అచేతనమైన మానసిక కృత్యాలను గురించి వివరించడానికి ప్రయత్నించిన వారిలో సోక్రటీస్ చెప్పుకోదగినవాడు.
* ‘ఆత్మ’లో ‘జ్ఞానం’ ఇమిడి ఉందని జ్ఞానం అంతర్గతంగా, నిగూఢంగా ఉంటుందని, దానిని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకురావచ్చని తెలియచేశాడు.
* ప్లేటో (428-348 బిసి)
* సోక్రటీస్ శిష్యుల్లో పేరొందినవాడు ప్లేటో. ఇతడు భావవాది. ‘మనస్సు’ మెదడులోను, ఇచ్ఛ హృదయంలోను, తృష్ణ లేదా వాంఛ ఉదరంలోను ఉంటాయని అభిప్రాయపడినాడు.
* వ్యక్తిలో మంచిని బయటకు తీసుకువచ్చేది విద్య అని అభిప్రాయపడినవాడు. ‘రిపబ్లిక్’ గ్రంథ రచయిత, ‘జిమ్నాషియా’ పాఠశాల ప్రారంభకుడు.
* అరిస్టాటిల్ (384-322 బిసి)
* ఇతడు ప్లేటో శిష్యుడు. ఆత్మను రెండు భాగాలుగా గుర్తించినవాడు. నిష్క్రియాత్మక మనస్సును ‘ఏమి రాయని నల్ల బల్లతో’ పోల్చి, ‘టాబ్యూలారాసా’ అని పేరు పెట్టినాడు. దీనిని చిన్న పిల్లల మనస్సుతో పోల్చినాడు. ఇతను రచించిన గ్రంథాలు డి అనిమా, పర్వతురాలియా, ఎథిక్స్, పాలిటిక్స్.
* సెయింట్ అగస్టీన్ (354-430 ఎడి)
* అంతఃపరీక్షణ లేదా అంతఃపరిశీలన పద్ధతుల ద్వారా మానసిక స్థితిని అంచనా వేసేవాడు. ఇతని పాండిత్యవాదం సంరచనాత్మక వాదానికి దారి తీసింది. కంఠతా పెట్టడం, మానసిక శారీరక శిక్షణ, పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసం ద్వారా పెంపొందించడం లాంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చాడు.
* రూసో (1712-1778)
* ఫ్రాన్స్ దేశస్థుడయిన ఇతడు ప్రాకృతిక వాదానికి మూలపురుషుడు.
* ‘ఎమిలి’, సామాజిక ఓడంబడికలు ఇతని రచనలు.
* ‘స్వయం ప్రేరణా పద్ధతులు’, ‘అనుభవం ద్వారా విద్య’, ‘క్రీడా విధాన పద్ధతు’లను విద్యామనోవిజ్ఞానశాస్త్రంలో ప్రతిపాదించిననాడు. ‘ప్రకృతిలోకి తిరిగి పోదాం’ అనేది ఇతని నినాదం.
* పెస్టోలజి (1746-1827)
* తెలిసిన విషయాలనుండి తెలియని విషయాలకు బోధన కొనసాగాలని, విద్యార్థి స్వయంగా అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలని చెప్పి విద్యా వ్యవస్థలో పలు విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఇతను స్విట్జర్లాండ్ దేశస్థుడు. 1805-1825 సం.ల మధ్య ‘యెర్డన్’ బోర్డింగ్ స్కూలులో తన విద్యాప్రయోగాలను నిర్వహించినాడు. 1780 సం.లో ‘ఈవెనింగ్ ఆఫ్ ఎ హెర్మిట్’అనే గ్రంథాన్ని రచించాడు. ఇతని సిద్ధాంతాలు వైయుక్తిక భేదాలు, సహజ సామర్థ్యాలపైన ప్రయోగాలకు దారితీశాయి. *

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Followers